పాట్నా: మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది. జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. నిఘా వర్గాల హెచ్చరికలతో బీహార్ పోలీస్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాదు, ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను కూడా పబ్లిక్కు విడుదల చేసింది. అనుమానాస్పదంగా ఎవరైనా కన్పిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది. ఉగ్రవాదులను రావల్పిండికి చెందిన హస్నైన్ అలీ, ఉమర్‌కోట్‌కు చెందిన అదిల్ హుస్సేన్, బహవల్పూర్కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించారు. వీరు పాక్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. వీరు గత వారం నేపాల్ మీదుగా బీహార్‌లోకి చొరబడ్డట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపారు. మరోవైపు నేపాల్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉగ్రవాదుల చొరబాటు తీవ్ర కలకలం రేపుతోంది.