ముంబై : ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో నిత్యావసర ధరలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీలో భాగంగా వెల్లడించిన నిర్ణయాలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్బీఐ చర్యలతో ద్రవ్యోల్బణం ఇప్పటికీ తీవ్ర ఆందోళనకరంగా ఉందని వెల్లడవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.గత 47 నెలలుగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆర్బీఐ అంచనా 4 శాతాన్ని మించి ఉంటోందని, కోట్లాది కుటుంబాలు నిత్యావసర ధరల పెరుగుదలతో ఎదుర్కొంటున్న కష్టాలను ఆర్బీఐ నివేదికే ఏకరువు పెడుతున్నదని ఆయన ట్వీట్ చేశారు. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని, వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గవచ్చని ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తంచేశారు.నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.