మణిపూర్‌లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదు

మణిపూర్‌లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదు

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదంటూ విమర్శించారు. మణిపూర్లో నెలకొన్న కల్లోల పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక్క రోజు సమయం కూడా ఎందుకు దొరకడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్న ప్రధాని మణిపూర్లో పర్యటించకపోవడం బాధాకరమన్నారు. ఆయన మణిపూర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టారని.. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆరాటపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు తాజాగా వెల్లడైంది. సాయుధ మూకల చేతిలో వారు హత్యకు గురైనట్లు తేలింది. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు నిరసనగా వందలాది విద్యార్థులు నిరసన చేపట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మరో ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos