న్యూ ఢిల్లీ: మోదీ సర్కార్ రాజ్యాంగ హత్యా దినోత్సవం జరపుతుండడంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ 11 ఏళ్ల పాలనను ‘అప్రకటిత అత్యవసర పరిస్థితి’గా అభివర్ణించింది. ఎమర్జెన్సీ సమయంలో కంటే మోదీ హయాంలో ప్రజాస్వామ్యం 5 రెట్లు ఎక్కువగా దాడికి గురైందని ఘాటు విమర్శలు చేసింది. మోదీ 11 ఏళ్ల పాలనలో ‘హద్దులేని ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, పౌర స్వేచ్ఛను అణిచివేయడం’ జరుగుతోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
ద్వేషాన్ని పెంచుతోంది!
“మోదీ సర్కార్ తమను విమర్శించేవారిని దుర్భాషలాడుతోంది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ద్వేషం, మతతత్వాన్ని వ్యాపింపజేస్తోంది. నిరసన తెలుపుతున్న రైతులపై ‘ఖలిస్థానీలు’ అని ముద్రవేస్తోంది. కుల గణనను సమర్థించేవారిని ‘అర్బన్ నక్సల్స్’ అంటోంది” అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.’ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ హంతకులను కీర్తిస్తున్నాను. మైనారిటీలు తమ ప్రాణాలు, ఆస్తులు పోతాయేమోనని భయపడి జీవిస్తున్నారు. దళితులు, ఇతర అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటు న్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి పదోన్నతులు లభిస్తున్నాయి’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘మోదీ హయాంలో రాజ్యాంగంపై దాడులు, పన్ను ఉగ్రవాదం, వ్యాపార, వాణిజ్య సంస్థలకు బెదిరింపులు, మీడియాపై నియంత్రణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం యథేచ్చగా కొనసాగుతోందని, ఈ విధంగా దేశంలో ‘అప్రకటిత అత్యవసర పరిస్థితి’ కొనసాగుతోందని’ పేర్కొన్నారు.