ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే వాలంటీర్ పోస్టులు?

ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే వాలంటీర్ పోస్టులు?

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించిన గ్రామ వాలంటీర్ల నియామకాలపై అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా లబ్దిదారులకు అందించే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నా నియామకాల్లో మాత్రం అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 23వ తేదీ వరకు నియామకాలు జరగాల్సి ఉన్నా చాలా జిల్లాల్లో ఇప్పటికే నియామక ప్రక్రియ ముగిసిందంటూ అధికారులు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది.ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇంటర్‌వ్యూలకు చివరిరోజైన 23వ తేదీ హాజరుకాలేకపోతే అటువంటి అభ్యర్థులకు ఈనెల25వ తేదీ ఇంటర్‌వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది.కానీ చాలా జిల్లాల్లో ఇప్పటికే నియామక ప్రక్రియ ముగిసినట్లు ప్రకటిస్తుండడం అనుమానాలు రేకెత్తిస్తోంది.ఇక ఇంటర్‌వ్యూల్లో చాలా చోట్ల అభ్యర్థుల మార్కులు వేయడానికి పెన్నుకు బదులు పెన్సిల్‌ వినియోగిస్తుండడం కూడా అనుమానాలకు,విమర్శలకు తావిస్తోంది.అభ్యర్థులను ఇంటర్‌వ్యూ చేసి ముగ్గురు అధికారులు విడివిడిగా మార్కులు వేస్తే ముగ్గురు వేసిన మార్కుల ఆధారంగా సరాసరి మార్కులతో అభ్యర్థులను ఎంపకి చేస్తారు.కొన్ని ప్రాంతాల్లో ఒక్క అధికారే మార్కులు వేస్తుండగా మరో కొన్నిచోట్ల దిగువస్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటుచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.దీంతో ఎంపిక ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాలంటీర్ల ఎంపికపై తుది నిర్ణయం ఎంపీడీవోలదేనని జిల్లా పంచాయతీ అధికారి చెప్తున్నారు.అయితే అన్నిచోట్ల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటంటే అభ్యర్థులను ఆయా ప్రాంతాల నియోజకవర్గ ఎమ్మెల్యేలే నిర్ణయించేస్తుండడం. ఆయా పంచాయతీల్లో వాలంటీర్లుగా నియమించేవారిని ఎమ్మెల్యేలే ఫైనల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు జాబితా రూపొందించి మండలస్థాయి అధికారులకు అందజేశారని .. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూ మొక్కుబడేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే అధికారులు మాత్రం ఇంటర్‌వ్యూలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, తుది ఎంపిక కూడా పారదర్శకంగానే ఉంటుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగే అంశాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో ఎంపిక ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos