అమరావతి: సహజవనరులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం చేసిన విషయంలో మాజీ సీఎం జగన్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ, ఈడీ, ఐటీ, రెవెన్యూ, పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించాలంటూ పిల్ దాఖలు చేసిన దిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరిని హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ వేసిందని న్యాయస్థానం తెలిపింది. కేంద్రసంస్థల అధికారులతో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు పిటిషనర్/న్యాయవాది మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ఆధారంగా పిల్‌పై విచారణ జరపలేమని తెలిపింది. ప్రచారం కోసం, స్వప్రయోజనాల కోసం దాఖలయ్యే ప్రజాహిత వ్యాజ్యాలపై జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేసింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్లు పేర్కొంది. మీ పిల్ ఆ కోవలోకి వస్తుందా? లేదా? అని చూడాలని ధర్మాసనం వెల్లడించింది. అంతకుముందు జరిగిన విచారణలో పిటిషనర్/న్యాయవాది మెహక్ మహేశ్వరి వాదనలు వినిపించారు. వైఎస్సార్సీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతిపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాలను విడుదల చేసిందని తెలిపారు. సిట్‌తో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ ఈ విషయంపై దర్యాప్తు జరగట్లేదా అని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ బదులిస్తూ రాష్ట్రప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిందని, కేంద్రసంస్థల అధికారులను అందులో చేర్చలేదని హైకోర్టుకి వివరించారు. మీలాంటి బిజీ న్యాయవాది ఇలాంటి పిల్ వేయడం, దిల్లీ నుంచి వచ్చి వాదనలు వినిపించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంతో మీకేం సంబంధమని మెహక్ మహేశ్వరిని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో మెహక్ మహేశ్వరి వాదనలు వినిపిస్తూ గతేడాది కాలంగా లిక్కర్ స్కాం కేసులోనే దర్యాప్తు చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిని అభియోగపత్రంలో నిందితుడిగా చేర్చలేదని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ప్రణతి స్పందిస్తూ ఇప్పటికే సిట్ ఏర్పాటుచేశామని, పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతికి సూచించారు. అనంతరం విచారణను 2026 ఫిబ్రవరి 11కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.