చంద్రబాబు ఆరోపణ
అమరావతి : వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులను ప్రధాని నరేంద్ర మోది తొక్కిపెట్టే ప్రయత్నాలు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్, మోదిలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. జగన్ కేసులను దర్యాప్తు చేస్తున్న ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ 2017 మే 31న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ, జగన్ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన లోపాలను అందులో ఎత్తి చూపారని తెలిపారు. ఈ పరిణామంతో జగన్, మోది, కేసీఆర్ కుమ్మక్కు బయటపడిందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో జగన్ భాజపా, తెరాసలకు బానిసగా మారారని విమర్శించారు. చట్టంలో ఎన్ని నేరాలకు శిక్షలున్నాయో, అవన్నీ జగన్‌కు వర్తిస్తాయని దుయ్యబట్టారు.