ఢిల్లీ : నౌకాదళ విశ్రాంత అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను భారత దౌత్యాధికారులు శుక్రవారం కలవడానికి పాక్ అనుమతించిన విషయమై పరిశీలిస్తున్నామని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ స్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని పరిశీలిస్తున్నామని, దౌత్య మార్గాల ద్వారా దీనిపై పాకిస్తాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తామని వివరించారు. కుల్ భూషణ్‌కు పాక్ సైనిక న్యాయ స్థానం విధించిన మరణ శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయ స్థానం ఇటీవల తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మరణ శిక్షను విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, అప్పటి వరకు శిక్షను అమలు చేయవద్దని కూడా ఆదేశించింది. జాదవ్ విషయంలో పాక్ అనుసరించిన తీరును ఆక్షేపించింది. న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పింది. దీంతో దిగివచ్చిన పాక్, కుల్ భూషణ్‌ను కలవడానికి భారత దౌత్యాధికారులను అనుమతిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది.