
బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ సోదాలు జరిగే అవకాశముందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ‘జోస్యం’ చెప్పిన 24 గంటల్లోనే రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడం కలకలాన్ని సృష్టిస్తోంది. గురువారం ఉదయం రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. మండ్య, మైసూరు, హసన్, బెంగళూరులోని మంత్రి నివాసం, కార్యాలయం, నీటి పారుదల శాఖ, పీడబ్ల్యూడీ కార్యాలయాలు, కాంట్రాక్టర్ల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ ఫరూక్, పీడబ్ల్యూడీ మంత్రి రేవణ్ణ అనుచరులు, ఆ శాఖ అధికారుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మూడు బృందాలుగా ఏర్పడ్డ ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.
‘మండ్య లోని నా నివాసంలో ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ జవాన్ల బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఈ తనిఖీలకు నేను భయపడను. నేనే తప్పు చేయలేదు. ఎన్నికల కోసమే ఈ సోదాలు చేస్తున్నారు. భాజపా నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగట్లేదు కదా. సోదాలను తప్పుబట్టడం లేదు. కానీ ఎన్నికల సమయంలో సోదాలు జరపడాన్ని తాను ప్రశ్నిస్తున్నా అన్నారు. బీజేపీ నేతల ఇళ్లల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్పాల’ని డిమాండ్ చేశారు. మండ్య లోక్సభ స్థానానికి జేడీఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ తొలిసారిగా బరిలోకి దిగారు. ఆయన గెలుపును జేడీఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దరిమిలా సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాన్ని రేకెత్తించింది.
రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతాయని కుమారస్వామి బుధవారం చెప్పారు. ‘దేశంలోని పలు ప్రాంతాల నుంచి 200-300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రాష్ట్రానికి వచ్చినట్లు నాకు పక్కా సమాచారం అందింది. ఐటీ దాడుల కోసమే వారిని రాష్ట్రానికి పిలిపించారు. గురువారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల్లో ఈ దాడులు జరిగే అవకాశముంది’ అని కుమారస్వామి అన్నారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలా తాను కూడా ధర్నాకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించకుండా సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి సోదాలు జరపడం చర్చనీయాంశమైంది.