కక్ష్యలోకి వెళ్లేందుకు మొరాయిస్తున్న ఎన్‌వీఎస్-02

కక్ష్యలోకి వెళ్లేందుకు మొరాయిస్తున్న ఎన్‌వీఎస్-02

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల తన వందో ప్రయోగం ద్వారా నింగిలోకి పంపిన నేవిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎస్-02 కక్ష్యలోకి వెళ్లేందుకు మొరాయిస్తోంది. దానిని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్లు ప్రజ్వరిల్లేందుకు మొరాయిస్తున్నట్టు ఇస్రో తెలిపింది. భారత్ సొంత నేవిగేషన్ వ్యవస్థకు ఎంతో కీలకమైన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని జనవరి 29న జీఎస్‌ఎల్వీ-ఎంకే2 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఇప్పుడీ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టే చర్యలు చేపట్టగా విఫలమయ్యాయి. ధ్రస్టర్లను ప్రజ్వరిల్లేలా చేసేందుకు ఆక్సిడైజర్‌ను పంపాల్సి ఉండగా, అది వెళ్లే వాల్వులు తెరుచుకునేందుకు మొరాయిస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం దీర్ఘవృత్తాకార జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో భూమి చుట్టూ తిరుగుతోంది. నావిగేషన్ వ్యవస్థకు ఈ కక్ష్య సరైనది కాదు. ఉపగ్రహం బాగానే పనిచేస్తోందని, కాకపోతే అది దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోందని ఇస్రో పేర్కొంది. ఇదే కక్ష్యలో నేవిగేషన్ కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకునేలా ప్రత్యామ్నాయ వ్యూహాలను ఉపయోగించుకుంటామని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos