ఐపీఎల్ 2020 చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముంబైకి ఈ సీజన్లోనే దారుణ పరాభవాన్ని రుచి చూపించిన వార్నర్ సేన.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలు నీరుగారాయి. కీలక మ్యాచ్‌లో వార్నర్, సాహా బ్యాటింగ్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం. 2013లో డెక్కన్ ఛార్జర్స్ సన్‌రైజర్స్‌గా మారింది. తొలి ఏడాదే ప్లేఆఫ్ చేరిన ఆరెంజ్ ఆర్మీ.. తర్వాత రెండేళ్లు లీగ్ దశలోనే నిష్క్రమించింది. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ప్లేఆఫ్ చేరింది. 2018లో వార్నర్ ఐపీఎల్‌కు దూరమైనా.. విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఫైనల్ చేరుకుంది. గత సీజన్లోనూ విలియమ్సన్ కెప్టెన్సీలోనే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.ఇప్పటి వరకూ అత్యధికంగా చెన్నై పదిసార్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. కానీ మధ్యలో రెండేళ్లపాటు నిషేధం ఎదుర్కొంది. దీంతో వరుసగా 8 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన జట్టుగా సూపర్ కింగ్స్ (2008-15) రికార్డ్ క్రియేట్ చేసింది. వరుసగా ఆరుసార్లు ప్లేఆఫ్ చేరుకొని ముంబై ఇండియన్స్ (2010-15) తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ ఉండటం విశేషం.