జూలై 1 నుండి నూతన క్రిమినల్‌ చట్టాల అమలు

జూలై 1 నుండి నూతన క్రిమినల్‌ చట్టాల అమలు

న్యూఢిల్లీ : నూతన క్రిమినల్ చట్టాలు వచ్చే నెల 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్‌వాల్ తెలిపారు. కాంగ్రెస్ ఇది ఏకపక్ష నిర్ణయమని పునరుద్ఘాటించింది. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి పార్ల మెంటులో ఈ చట్టాలను ఏకపక్షంగా ఆమోదింపజే సుకున్నారని ఆరోపించింది.
ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాన్ని తీసుకొని వస్తున్నామని మేఘవాల్ చెప్పారు. ‘తమను సంప్రదించలేదని కొందరు చెబుతున్నారు. ఇది నిజం కాదు. వలసవాదుల కాలం నాటి చట్టాలను మార్చాలని చాలా కాలం నుండి డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడో మొదలైంది’ అని ఆయన తెలిపారు. ‘మేము ఎంపీలందరినీ సంప్రదించాం. అయితే ఉభయ సభలకు చెందిన 142 మంది సభ్యులు మాత్రమే స్పందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల నుండి సూచనలు కూడా కోరాము. వారిలో కేవలం 270 మంది మాత్రమే స్పందించారు. మేము విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపాము. కానీ ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు తెలియజేయలేదు’ అని వివరించారు.
ప్రతిపక్షాలు లేకుండానే…
చట్టాలను మార్చేందుకు ఉద్దేశించిన బిల్లులకు లోక్సభ గత సంవత్సరం ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో 97 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులను ప్రభుత్వం సభలో ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలోనే ఇదే తంతు నడిచింది. బిల్లులపై సభలో సుమారు ఆరు గంటల పాటు చర్చ జరిగింది. ఆ సమయంలో పెద్దల సభలో ప్రతిపక్ష సభ్యులెవరూ లేరు. ప్రతిపక్ష స్థానాలు పూర్తిగా ఖాళీగా ఉండడాన్ని గమనించిన ప్రభుత్వం సభలో బిల్లులను ఆమోదింపజేసుకొని ఊపిరి పీల్చుకుంది.
న్యాయ వ్యవస్థ గొంతు నులమడమే : కాంగ్రెస్
మేఫ్‌ువాల్ వాస్తవాలను కప్పిపెడుతున్నారని చండీఘర్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. చట్టాలను అమలు చేయడమంటే భారత న్యాయ వ్యవస్థ గొంతు నులమడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టాలలోని కొన్ని నిబంధనలు భారత రిపబ్లిక్కు పునాది అయిన పౌర స్వేచ్ఛపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. వీటి అమలును కొంతకాలం నిలిపివేయాలని మనీష్ తివారీ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos