తుని:‘దయచేసి రోజూ ఒక సారి మీ మొహాన్ని చూపించటడమ్మా. కరోనా కాలంలో నిర్భయంగా బతికేస్తామ’ని తూర్పుగోదావరి జిల్లా, తుని పట్టణంలో పోలీసులు ఒక మహిళకు విన్నవించారు. కారణం ఎందుకో తెలుసా? ఆమె ఇటీవల మండుటెండలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రెండు పెద్ద సీసాల శీతల పానీయాలు అందించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దమ్మా అంటూ పోలీసులు వాటిని తీసుకోవటానికి మొహమాట పడ్డారు. ఆ తరువాత ఆమే పోలీసులకు తనో కూలీనని, తన ఆదాయం నెలకు రూ.మూడు వేలని చెప్పారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న పోలీసుల గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇలాచేసానని వివరించారు. దీంతో కదిలిపోయిన పోలీసులు ‘‘అమ్మా, మీకు వీలైతే మీ ముఖం రోజూ ఒకసారి మాకు చూపిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది’ అని చెప్పటం చూసిన వారి మనసులను కదిలిస్తోంది. నటుడు మాధవన్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఎక్కించారు. బాగా సంచలనమైంది.