హోసూరు : ఇక్కడి అన్నా శిల వద్ద ఉంచిన పెరియార్ చిత్రపటం ముందుకు వాలిపోయినా, పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు విమర్శించారు. తమిళనాడు పెద్దాయనగా పేరుగాంచిన పెరియార్ 142వ జయంతిని పురస్కరించుకొని హోసూరు తాలుకాఫీసు వద్ద గల అన్నాదురై విగ్రహం వద్ద డిఎంకె పార్టీ నాయకులు పెరియా ర్ చిత్రపటాన్ని ఉంచి, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ చిత్రపటాన్ని సరిగా ఉంచకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలికి ఊగుతూ కనిపించినా, నిత్యం రద్దీగా ఉండే తాలుకాఫీసు కూడలిలో స్థానికులు కానీ, నాయకులు కానీ పట్టించుకోక పోవడం విమర్శలకు దారి తీసింది. పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు వాపోయారు.