న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నాటికి 35,567 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) మూతబడ్డాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైనవే. ఎంఎస్‌ఎంఈల శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఎంఎస్‌ఎంఈలు ఇంత పెద్ద సంఖ్యలో మూతపడడానికి కారణమేమిటో ఆమె వివరించలేదు. 2020 జులై 1వ తేదీన పోర్టల్ ప్రారంభం కాగా అప్పటి నుంచి 75,082 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయని మాత్రం ఆమె తెలిపారు. ఇప్పటి వరకూ మూతబడిన మొత్తం ఎంఎస్‌ఎంఈలలో 47.4 శాతం ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మూతపడడం గమనార్హం. 2023-24తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రెట్టింపు పరిశ్రమలకు తాళం పడింది. గత సంవత్సరం 19,828 పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలు ఎక్కువ సంఖ్యలో మూతబడిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో 8,472 పరిశ్రమలను మూసేశారు. తమిళనాడు (4,412), గుజరాత్ (3,148), రాజస్థాన్ (2,989), కర్నాటక (2,010) తర్వాతి స్థానాలలో నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉన్నందున మూతపడిన పరిశ్రమల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాన్ని సరళతరం చేసేందుకు ఉద్యమ్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవలి కాలంలో సులభతర వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి బడ్జెట్‌లో అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించారు. పెట్టుబడులు, టర్నోవర్ పరిమితులను పెంచారు. రుణ గ్యారంటీలను కూడా పెంచడం జరిగింది. అయినప్పటికీ వాటికి తాళాలు పడుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రరైన ఎంఎస్‌ఎంఈలు 6.05 కోట్లు. కోవిడ్-19 తర్వాత ఎంఎస్‌ఎం ఈలు అధిక సంఖ్యలో తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. అయితే ఈ మూసివేతల కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారన్న దానిపై ఎలాంటి గణాంకాలు అందుబాటులో లేవు. ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మజ్హీ లోక్‌సభకు ఇచ్చిన వివరాల ప్రకారం గత పది సంవత్సరాలలో యాభై వేల చిన్న చిన్న వ్యాపారాలు మూతపడడంతో మూడు లక్షల మంది రోడ్డున పడ్డారు. పోర్టల్‌లో రిజిస్టరైన పది లక్షల ఎంఎస్‌ఎంఈ లలో 49,342 మూతపడ్డాయని, ఫలితంగా 3,17,641 మంది ఉద్యోగాలు కోల్పోయారని మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కంపెనీ యాజమా న్యంలో మార్పులు, అవసరం లేని సర్టిఫికెట్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు వంటి పలు కారణాల వల్ల చిన్న పరిశ్రమలను మూసివేస్తున్నారని మంత్రి తెలిపారు.