న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ‘టేకోవర్’ పేరుతో హస్తగతం చేసుకునేందుకు విదేశీ పారిశ్రామిక గెద్దలు పొంచివున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. సోమవారం ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గత వారం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ డీఎఫ్సీ)లో 1.75 కోట్ల షేర్ల కొనుగోలు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని హెచ్చరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విదేశీ సంస్థలు మన కార్పొరేట్లను హస్తగతం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంద ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ కూడా ‘మనుషుల ప్రాణాలతోపాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సి ఉంది. మనిషి మనుగడ ఉంటేనే ప్రపంచం ఉంటుంది. అందువల్ల ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే మనిషి మనుగడను ముందు కాపాడాలి’ అన్నారు. దెబ్బతిన్న భారతీయ ఆర్థిక వ్యవస్థలోకి చొచ్చుకు రావాలన్న విదేశీ పరిశ్రమల అడుగులకు అడ్డు కట్ట వేయకుంటే ప్రమాదమే.