అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజున రిపబ్లికన్ అభ్యర్థి అధ్యక్షుడు ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. జూనియర్ ట్రంప్ ట్వీట్ పై భారతీయులు భగ్గుమన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ ట్రంప్ పెద్ద కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కొద్దిసేపటి క్రితం ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో భారత్ చైనా దేశాలను నీలం రంగులో చూపించాడు.దాదాపు మిగతా ప్రపంచదేశాలన్నీ ఎరుపురంగులో చూపించాడు.అమెరికాలో రిపబ్లికన్ పార్టీ గుర్తు ఎరుపు.. ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ గుర్తు నీలం. సో ఆ కోణంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మద్దతు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కేనని.. ఒక్క భారత్ చైనా మద్దతే డెమొక్రటిక్ పార్టీకని అర్థం వచ్చేలా ఈ పోస్ట్ పెట్టారు.అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలుపుతూ జూనియర్ ట్రంప్ ఈ ట్వీట్ చేయడం భారతీయుల కోపానికి కారణమైంది. జమ్మూకశ్మీర్ భారత్లో భాగమని.. పాకిస్థాన్తో ఎలా కలుపుతారంటూ ట్రంప్ కుమారుడిపై భారతీయులు నిప్పులు చెరిగారు.. అవగాహన లేకుండా ఇటువంటి ఫొటోలు పెట్టొద్దంటూ కౌంటర్లు ఇచ్చారు. ఎన్నికల వేళ ఇది రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ కు.. పెద్ద మైనస్ గా మారింది.అయితే కమలా హ్యారీస్ భారత సంతతి వ్యక్తి కావడంతోనే భారత్ ను డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా జూనియర్ ట్రంప్ చూపించాడని రిపబ్లికన్స్ వెనకేసుకొస్తున్నారు.ఇప్పుడీ వివాదం అమెరికాలో రాజుకుంది.