12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు

12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం  రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. అలాగే శ్లాబులను కూడా తగ్గించామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగానే టీడీఎస్‌, టీసీఎస్‌ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారతీయ న్యాయ సంహిత్‌ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు. బిల్లులో సులభతర విధానం తీసుకురాబోతున్నామని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos