బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం సంభవించిన వింత భారీ శబ్దాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి.భారీ విస్పోటనాలు సంభవించినట్లుగా వినిపించిన శబ్దాలకు భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.ఈ శబ్దాల గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చలు,వీడియోలు వైరల్ కావడంతో శబ్దాలు ఏంటనే విషయంపై విస్తృతంగా చర్చ సాగింది.దీనిపై విచారణ జరిపిస్తామని నగర పోలీస్ కమిషనర్ భాస్కరరావు తెలిపారు.అయితే ఈ శభ్దాలకు కారణంపై వాయుసేన గురువారం వివరణ ఇచ్చింది.ఈ శబ్దాలు భూకంపం వల్ల వచ్చినవో లేక విస్పోటనాల వల్ల వచ్చినవో కాదని భారత వాయుసేనకు చెందిన టెస్ట్ ఫ్లయిట్, సూపర్ సానిక్ వేగంతో ప్రయాణించడం వల్ల ఈ శబ్దాలు వచ్చాయని వెల్లడించింది.36 వేల నుంచి 40 వేల అడుగుల ఎత్తున ఎగిరే ఈ విమానం సూపర్ సానిక్ వేగం నుంచి సబ్ సానిక్ వేగానికి చేరుకునే క్రమంలో ఇలా భారీగా శబ్దాలు వస్తుంటాయని వివరణ ఇచ్చారు. ఈ శబ్దం వచ్చినప్పుడు నగరానికి చాలా దూరంలో విమానం ఉందని, ఈ విమానం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, శబ్దాలు వినిపిస్తాయని పేర్కొన్నారు.