ఇస్లామాబాద్: విరాట్ కోహ్లీని ప్రశంసించడం తప్పేమీ కాదని పాకీస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లీ వంటి ఆటగాడు ప్రపంచ క్రికెట్లో ఎవరూ లేరని, అలాంటి ఆటగాడి ప్రతిభను పొగడడం తప్పెలా అవుతుందని ప్రశ్నించాడు. భారత ఆటగాళ్లు మాత్రమే కాదని, అంతర్జాతీయంగా ప్రతిభావంతుడైన ప్రతి ఆటగాడినీ తాను మెచ్చుకుంటానని చెప్పాడు. ఎప్పుడూ భారత క్రికెటర్లను ప్రశంసిస్తుంటాడంటూ షోయబ్ అక్తర్పై పాక్లో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్తర్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంకా అతడికి ఎంతో కెరీర్ ఉంది. చిన్న వయసులోనే అన్ని సెంచరీలు సాధించి ప్రపంచ మేటి క్రికెటర్గా కోహ్లీ గుర్తింపు పొందాడు. పాకీస్తాన్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికీ అలాంటి ఘనత లేదు. అలాంటి ఆటగాడు ప్రతి ఒక్కరి ప్రశంసకూ అర్హుడు. భారతీయుడు అయినంతమాత్రాన కోహ్లీని ప్రశంసించకూడదనడం సరికాదు. అందుకే కోహ్లీని నేను ఎల్లప్పుడూ అభినందిస్తూనే ఉంటాను. ఎవరు ఏమనుకున్నా సరే..’ నని అక్తర్ పేర్కొన్నారు.