హొసూరు : లక్షలు ఖర్చు చేసి పండించిన టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు బావురుమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రావని భావించి టమోటాలను రోడ్లపై పోస్తున్నారు. హొసూరు ప్రాంతంలో టమోటా, క్యారెట్, బీట్రూట్, బంగాళా దుంపలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితర వాణిజ్య పంటలను విస్తారంగా పండిస్తారు. ఈ ప్రాంతంలో పండిస్తున్న కూరగాయలను తమిళనాడులోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, తిరుచ్చి తదితర జిల్లాలకే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, కేరళ తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తారు. ఇటీవల కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో రైతులు టమోటాలను ఎక్కువగా పండించడంతో హొసూరు ప్రాంతం నుంచి కర్ణాటకకు పంపుతున్న టమోటాలను కొనుగోలు చేసే వారు కరువై గిరాకీ బాగా తక్కువైంది. దీంతో ఈ ప్రాంత రైతులు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు టమోటాలను పంపడం మానివేశారు.
అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేయడంతో పాటు అక్కడి పంటను హొసూరు మార్కెట్కు తరలిస్తున్నారు. దీంతో హొసూరు ప్రాంతంలో పండిస్తున్న టమోటాలకు గిరాకీ మరింతగా క్షీణించింది. విధి లేక రైతులు టమోటాలను రోడ్లపాలు చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి పండించిన పంటను గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోస్తున్నామని రైతులు వాపోతున్నారు. హొసూరు మార్కెట్లో ప్రస్తుతం కిలో టమోటా రూ.2కు విక్రయిస్తున్నామని, ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ప్రవేశం చేసి, హొసూరు ప్రాంతంలో టమోటా పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.