
ముంబయి: ముంబయి వర్లీలో బుధవారం రాత్రి హోలికకు బదులుగా జైషే మహ్మద్ ఉగ్ర వాద సంస్థ అధినేత మసూద్ అజార్ దిష్టి బొమ్మను దహనం చేశారు. హోలీ పండగ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేయడం సంప్రదాయం. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా ముంబయిలోని పలు ప్రాంతాల్లో మసూద్తో పాటు ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం దిష్టి బొమ్మలు, చిత్ర పటాల్ని కూడా దహనం చేసి నిరసించారు. దేశ భక్తికి ప్రతీకగా వందేమాతరం నినాదాలు చేసారు. ‘రాక్షసు లను అంతం చేయాలి. అందుకే ఈ రోజు మసూద్, దావూద్, సయీద్ దిష్టి బొమ్మలను మేం తగలబెట్టాం. పుల్వామా దాడి లేదా మరో ఉగ్రదాడే కావొచ్చు.. మన దేశంలో జరిగే ఉగ్ర ఘటనలకు ఈ ముగ్గురే కారణం. వారికి శిక్ష పడాలి’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివసేన నేత ఒకరు పేర్కొన్నారు.