
న్యూఢిల్లీ: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు ప్రధాని మోదీ ఏమాత్రం తీసిపోరనీ, అసమ్మతి గళాలను మూయిచేందుకు సైనిక బలగాలను వాడుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టి అధ్యక్షుడు అరవింద కేజ్రీవాల్ శనివారం ట్విట్టర్లో విరుచుకు పడ్డారు. ‘హిట్లర్ గూండాలు అమాయక ప్రజలను హింసించి, చంపేవారు. బాధితుల పైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టేవారు. మోదీ కూడా అలాగే చేస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకు నేందుకు హిట్లర్ అనుసరించిన వ్యూహాలనే మోదీ అనుసరిస్తున్నారు. అయినప్పటికీ దేశం ఎటు పోతున్నదో ఆయన అనచరులు కూడా తెలియదు’ అని వ్యాఖ్యానించారు. గురుగ్రామ్‌లోని ఓ ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన కొద్ది సేపటికే సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు స్పందించారు. బాధిత కుటుంబానికి చెందిన పిల్లలు ఆరు బయట క్రికెట్ ఆడుతుండగా నిందితులు వారిని పాకిస్తాన్ వెళ్లి ఆడుకోండి అనటంతో వివాదం మొదలైనట్టు తెలిసింది. ‘ఈ వీడియో చూడండి. ముస్లింలను కొట్టమని ఏ పవిత్ర గ్రంథం చెప్పింది. భగవద్గీతలోనా? రామాయణంలోనా? లేదా హనుమాన్ చాలీసాలోనా?’ అని ప్రశ్నించారు.