కొద్ది రోజుల క్రితం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో చీరాల నియోజకవర్గంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆమంచి వైసీపీలో చేరడంతో సహజంగానే వైసీపీలో ఆమంచికి ప్రాధాన్యత దక్కింది.గత ఎన్నికల్లో చేసిన తప్పుల వల్ల అధికారం దక్కే అవకాశాన్ని చేజేతులా కోల్పోయినట్లు భావించిన వైసీపీ అధినేత జగన్ ఈసారి ఎన్నికల్లో అదే తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు.ఈ క్రమంలో ప్రతీ నియోజకవర్గంలోనూ తప్పకుండా విజయం సాధించగలరనే నమ్మకం ఉన్న అభ్యర్థులకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు.అందులో భాగంగా గత ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించిన ఆమంచికే ఈసారి టికెట్ ఇవ్వడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీంతో అప్పటివరకు చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బాలాజీ మనస్తాపానికి గురైనట్లు సమాచారం.టీడీపీలో ఉన్న ఆమంచి వైసీపీలోకి చేరిన నేపథ్యంలో వైసీపీలో తనకు ప్రాధాన్యత దక్కదని భావించిన బాలాజీ తెదేపాలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.సోమవార రాత్రి బాలాజీ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిక్కెట్ పైన హామీ వస్తే ఆయన టీడీపీలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి సమీప అభ్యర్థి టీడీపీకి చెందిన పోతుల సునీతపై 10వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన బాలాజీ ఎడం మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇన్నాళ్లు వైసీపీ ఇంచార్జిగా ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఆమంచికి చేర్చుకోవడంపై ఆగ్రహంతో ఉన్న బాలాజీ.. టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తారా లేక టిక్కెట్ ఆశిస్తున్నారా తెలియాల్సి ఉంది.