ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఆంగ్లమాధ్యమంపై హైకోర్టులో అక్షింతలు వేయించుకున్న జగన్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై మరోసారి మొట్టికాయలు వేయించుకుంది.రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులపై ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని న్యాయవాది సోమయాజులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై న్యాయస్థానం విచారించింది.ఆఫీసులకు వేస్తున్న కొత్త రంగులు కూడా పార్టీ రంగులను పోలి ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. సర్కారు వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. రంగులకు సంబంధించిన జీవోను రద్దు చేయడమే కాకుండా సీఎస్, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ తీరు విషయాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని వివరించింది. ఈ కేసు 28న విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.