అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదార్లు జలమయమయ్యాయి. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. విజయవాడ నగరం తడిసిముద్దవుతోంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో భారీగా వానపడుతోంది.
మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.