హైదరాబాద్ : ఎన్నికల నియమావళి అమలులో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న నగర పోలీసులకు భారీ మొత్తంలో హవాలా సొమ్ము లభ్యమైంది. సుల్తానాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు నలుగురు వ్యాపారుల నుంచి రూ.90.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో దేవేష్ కొటారి (రూ.50 లక్షలు), భక్తి ప్రజాపతి (రూ.23 లక్షలు), విశాల్ జైన్ (రూ.11.80 లక్షలు), నసీమ్ (రూ.5.70 లక్షలు) ఉన్నారు. తమ వద్ద ఉన్న నగదుకు వీరు ఆధారాలు చూపించలేదని, గత కొంత కాలంగా వీరు వేర్వేరుగా హవాలా వ్యాపారం చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రూ.50 వేలకు మించి వెంట పెట్టుకోవద్దని, ఒక వేళ ఉంటే దానికి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.