హైదరాబాదు:మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ఇటీవల కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కవిత శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందిస్తూ, తనపై ఆరోపణలు చేస్తున్న వారి విజ్ఞతకే దానిని వదిలివేస్తున్నానన్నారు.ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు. ఇటీవల తనపైనా, పార్టీపైనా కొందరు ఆరోపణలు చేశారని, అయితే అవి ఎందుకు చేశారో, ఎవరి లబ్ధికోసం చేశారో వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు.ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైనా హరీశ్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ముందున్న కర్తవ్యమని హరీశ్ రావు అన్నారు.