వ్యవస్థల వైఫల్యంతోనే ‘సాయిబాబా’ మృతి

వ్యవస్థల వైఫల్యంతోనే ‘సాయిబాబా’ మృతి

కడప : దేశం ఫాసిజానికి దగ్గరవుతోందని, అభ్యుదయవాదులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ప్రముఖ విశ్రాంత అధ్యాపకులు, పౌరహక్కుల వేత్త హరగోపాల్‌ పేర్కొన్నారు. కడపలోని హరిత్‌ హోటల్‌లో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది బొగ్గుల గుర్రప్ప అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ‘ప్రొఫెసర్‌ జి ఎన్‌ సాయిబాబా స్మృతి.. చట్టం అందరికీ సమానమేనా ‘ అంశంపై హరగోపాల్‌ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. దేశంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం ప్రమాదంలో పడ్డాయన్నారు. రాజ్య స్వభావం మారేకొద్దీ పోరాటాలు పెరుగుతాయనే సంగతిని గుర్తించుకోవాలన్నారు. నిరాధారమైన ఆరోపణలతో ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబాను పదేండ్ల పాటు జైలులో పెట్టి, ఆయన విలువైన సమయాన్ని బలి తీసుకున్నారని అన్నారు. విశ్వవిద్యాలయ, న్యాయ వ్యవస్థ, జైలు వ్యవస్థల వైఫల్యం కారణంగా సాయిబాబా మృతి చెందారని విమర్శించారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాంభూపాల్‌ మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో మణిపూర్‌కు చెందిన ఎనిమిది మంది బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు నిరసన ర్యాలీ నిర్వహించడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోందన్నారు. మోడీ పదేండ్ల పాలనలో 548 మందిపై రాజద్రోహం కేసులు నమోదు చేసిన ఘనత ప్రపంచ దేశాల్లో ఎక్కడా చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. హత్రాస్‌ ఘటన కవరేజికి వెళ్లిన సిద్ధిఖ్‌కప్పన్‌ జర్నలిస్టును 712 రోజులు జైలులో నిర్బందించారన్నారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రవి ప్రసంగించారు. చివరగా పిహెచ్‌డి స్కాలర్‌ మల్లెల భాస్కర్‌ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, బుద్ధిస్ట్‌ కల్చరల్‌ సొసైటీ నాయకులు కుళాయిస్వామిరెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు ఓబుల్‌రెడ్డి, రాజావెంగల్‌రెడ్డి మహేశ్వరరెడ్డి, ప్రజా సంఘాలు, ఎల్‌ఐసీ యూనియన్‌ నాయకులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos