కరోనా నేర్పిన పాఠాలు..

కరోనా నేర్పిన పాఠాలు..

ప్రపంచాన్ని మరణభయంతో వణికిస్తున్న కరోనా కొన్ని విషయాల్లో మానవాళికి మంచే చేస్తోందని మనుషులు ఎప్పుడో మరచిపోయిన విషయాలను గుర్తు చేస్తూ వాటిని పాటించేలా పాఠాలు నేర్పుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కరచాలనం చేయడం,తుమ్మినపుడు లేదా దగ్గిన సమయంలో రుమాలు అడ్డుపెట్టుకోవడం,భౌతిక దూరం పాటించడం,వ్యక్తిగత శుభ్రతను పాటించడంతో పాటు ఇళ్లు,పరిసరాలను సైతం స్వచ్చంగా ఉంచడం,ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నింటినో నేర్పించింది.అన్నిటికంటే ముఖ్యంగా స్నేహ బంధాలను,ఇతరులకు సహాయపడడాన్ని నేర్పించింది.కరోనా నిర్మూలనలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు చాలా రోజులగా ఇళ్లకే పరిమితం కావడంతో కొత్త బంధాలు,స్నేహాలు ఏర్పరచుకుంటున్నారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువులతో పాటు వంటగ్యాస్‌,నీళ్లక్యాన్‌లు తదితర వాటికి ఎదరవుతున్న ఇబ్బందులు నగరాలు,పట్టణాల్లో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఏళ్లుగా ఉంటున్నా ఒకరికొరు పరిచయం లేని వారిని కలుపుతున్నాయి.కష్టకాలంలో ఒకరికి ఒకరు సహాయం అందించుకునేలా చేస్తున్నాయి.ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడో తెంచుకుపోయిన పాత బంధాలన్నీ మళ్లీ బలపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నాయి,వినిపిస్తున్నాయి.­­ఇక పేద,మధ్య తరగతి ప్రజల కష్టాలు,ఆకలి బాధలు,వ్యథలు తెలియని ఎంతోమంది ధనికులకు లాక్‌డౌన్‌ ఆకలి విలువ,మనుషుల విలువను తెలిసేలా చేసింది.లాక్‌డౌన్‌ ప్రకటించిన 21 రోజుల్లో 18 రోజులకే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరాలుగా పేరుగాంచిన ఘజియాబాద్‌,ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాలుష్యనగరాలు పేరుగాంచిన ముంబయి,బెంగళూరు,హైదరాబాద్‌ తదితర మహానగరాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గింది.ఫ్యాక్టరీల నుంచి,వాహనాలు నుంచి వెలువడే విషవాయువుల వల్ల పూర్తిగా కలుషితమైన ఎన్నో నదులు స్వచ్ఛంగా దర్శనమిస్తున్నాయి.ఎన్నో దశాబ్దాల అనంతరం జలంధర్‌ పట్టణ వాసులకు ఇళ్ల నుంచి హిమాలయ పర్వతాలను చూసే భాగ్యం దక్కింది.ఎన్నో అరుదైన పక్షులు,వృక్షాలు,జంతువుల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో పుట్టుకొచ్చిన కరోనా వాటి పాలిట జీవప్రదాతగా నిలిచింది.కరోనా దెబ్బకు జంతువులు,పక్షుల వైపు చూడాలన్నా భయపడే పరిస్థితులు తలెత్తడంతో అంతరించిపోయే స్థితికి చేరుకున్న సాధారణ పక్షులు,జంతువులతో పాటు అరుదైన వృక్ష,మృగాలు,పక్షుల జాతులు పునర్జీవం పోసుకుంటున్నాయి.కరోనా ధాటికి మనుషులంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులు,పక్షులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక బడాయి బతుకుల్ని ఆగమాగం చేయటమే కాదు.. జీవితం ఎంత సింపులో తెలుసా? అన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిన ఘనత కరోనా వైరస్ దేనని చెప్పాలి. నాకు మించినోడు ప్రపంచంలో మరెవరూ లేరంటూ విర్రవీగే మానవసమాజానికి సవాలు విసరటమే కాదు.. గజగజలాడిపోయేలా చేసింది. కంటికి కనిపించినంత సూక్ష్మమైన ఒక చిన్న వైరస్ ధాటికి మనిషి అనే మొనగాడు ఎంతలా విలవిలలాడిపోయామో ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. ప్రకృతిలో మనిషి ఒకడు తప్పించి.. ప్రకృతి మొత్తానికి అతడొక్కడేమీ కాదన్న విషయం బాగా అర్థమయ్యేలా చేసింది కరోనా. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంపన్న రాష్ట్రమని గొప్పలు చెప్పే పాలకులకు.. తమ పాలనలో ప్రజల బతుకులు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయన్న మాటను మళ్లీ చెప్పకుండా చేసిన టాలెంట్ కరోనాదేనని చెప్పాలి. వైరస్ విరుచుకుపడిన వేళ.. వైద్యపరంగా మన స్థాయి ఏమిటో అర్థమైపోవటమే కాదు.. అవును.. సరైన వైద్యాన్ని అందించటంలో మనం వెనుకబడే ఉన్నామన్న విషయాన్ని పాలకుల చేత చెప్పించేసింది. ప్రజలకు చేయాల్సిందెంతో ఉందన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసింది. ఇరవై రోజుల పాటు పని చేయకుండా అందరూ ఎవరింట్లో వారు ఉండి పోతే.. ఖజానాలు ఎంతలా ఖల్లాస్ అయిపోతాయన్న విషయం పై క్లారిటీతో పాటు.. ఏదైనా సంక్షోభం ఎదురైత బతుకులు ఎంతలా ఆగమాగమైపోతాయన్న విషయం అర్థమయ్యేలా చేసింది. ఇటీవల కాలంలో యుద్ధాలు.. భారీ సంక్షోభాలు చూడని భారతీయులు.. మధ్య కాలంలో ఏదైనా తేడా వస్తే పొరుగు దేశంతో యుద్ధం చేయాలన్న రణ కుతూహాలాన్ని వ్యక్తం చేయటమే కాదు.. పెద్ద పెద్ద మాటల్ని చెప్పేసేవారు.కరోనా పుణ్యమా అని.. మనకున్న వనరులు.. మన శక్తి సామర్థ్యాలు ఏమిటో అర్థమై పోవటమేకాదు.. మన ఆర్థిక పరిస్థితి ఎంత అల్పమైనదో కూడా అందరికి అర్థమై పోయేలా చేసింది కరోనా. ప్రకృతిలో మనిషి అనేటోడు ఎంత అల్పమైనోడన్న విషయాన్ని తెలిసేలా చేసి.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించకపోతే అంతే అన్న విషయాన్ని చెప్పిన కరోనాకు ప్రతి ఒక్కడూ థ్యాంక్స్ చెప్పాల్సిందే.అయితే మనుషులకు ఈ పాఠం నేర్పించడానికి కరోనా వేలాది మందిని బలి తీసుకుంటుండడం,లక్షలాది మంది బ్రతుకులను వీధిపాలు చేస్తుండడం విషాదకర ఘట్టంగా అభివర్ణించాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos