న్యూ ఢిల్లీ :తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించు కుంది. ‘సమస్య చాలా చిన్నది. పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటే సరిపోతుందని సీనియర్ నేతలు ఒత్తిడి తెచ్చారు. వారి అభిప్రాయాలను గౌరవించాల’ని ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం ప్రతినిధి వెల్లడించారు. సోమవారం న్యాయస్థానం కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యాజ్యం పై న్యాయస్థానం తీర్పు వెలువడేంత వరకూ శాసనసభను సమావేశ పరచరాదని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రకటించటం, ఆయన కర్తవ్య పాలననూ పరీక్షించ దలచటమూ మరో కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘గతంలో ఈ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం పాటించకపోవడం దురదృష్టకరం. ఇది మాకు బాధను కలిగిస్తోంది. తమ కక్షిదారు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నారు. మేమూ సమస్యను కొనసాగించదలచటం లేద’ని రాజస్థాన్ సభాపతి జోషి తరఫు న్యాయవాధి కపిల్ సిబాల్ తన వాదనలో ఆక్రోశించారు.