లాహోర్: ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ‘శుక్రవారం ప్రసంగా’న్ని పాకిస్థాన్ ప్రభుత్వం తొలి సారిగా నిషేధించింది. ప్రతి శుక్రవారమూ సయీద్ లాహోర్ జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయ ఆవరణలోని జామియా ఖాద్సియా మసీదులో ఉపన్యసిస్తారు. ఒకప్పుడు పంజాబ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆ ప్రాంతాన్ని ప్రభుత్వంస్వాధీనం చేసుకోవటంతో ఆయనకు గడ్డు పరిస్థితి తలెత్తింది. హఫీజ్‌ను అక్కడికి అనుమతించేది లేదని పంజాబ్ ప్రావిన్స్ అధికారులు తేల్చి చెప్పారు. ఎప్పటి లాగే శుక్రవారం అక్కడ ప్రసంగించడానికి తనను అనుమతించాలంటూ హఫీజ్ చేసిన వినతిని న్యాయ స్థానం కూడా తిరస్కరించింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలన్న హఫీజ్ అభ్యర్థననూ ఐరాస తోసి పుచ్చటం తెలిసిందే. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా నిషేధిత సంస్థలపై పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా జమాత్ ఉద్ దవాకు చెందిన 120 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. చట్టబద్ధత లేని ఈ అరెస్టులతో పాక్ ప్రభుత్వం ఉగ్ర వాదులను కాపాడటానికి ప్రయత్ని స్తోందని భారత్ తప్పు బట్టింది.