అమృత్సర్ : విద్యుత్ వైర్లు, మీటర్లను దొంగతనం చేశాడనే ఆరోపణపై మజితా నియోజకవర్గంలోని కోట్ల సుల్తాన్ సింగ్ గ్రామంలో దళిత యువకుడు గుర్వేల్ సింగ్ని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక భూస్వాములు అతడిని దారుణంగా కొట్టి చెట్టుకు తలకిందులుగా వేలాడ దీశారు. దళితులు అయినందువల్లే తమ తమ్ముడిని కొట్టి చెట్టుకు తల కిందులుగా వేలాడ దీశారని గుర్వేల్ సోదరుడు గుమ్మీజ్ సింగ్ ఆరోపించాడు. దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని తెలిపారు. పోలీసులు బాధితుడిని కాపాడినా కేసు నమోదు చేసుకోవడంలో జాప్యం చేశారని విమర్శించారు. దర్యాప్తు గురించి పెద్దగా శ్రద్ధ చూపలేదని ధ్వజమెత్తారు. బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నామని స్టేషన్ హౌస్ అధికారి జగ్దీప్ సింగ్ పేర్కొన్నారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.