న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్ అఖిల పక్ష నేతల భేటీ ఆశించిన ఫలితం ఇవ్వలేదంటూ గుప్కార్ కూటమి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ సమావేశంపై నిరాశ చెందాం. రాజకీయ ఖైదీల విడుదల వంటి విశ్వాసం పెంచే చర్యలేవీ తీసుకోలేద’ని పెదవి విరిచారు. గుప్కార్ కూటమి నేతలు ఆదివారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సారథ్యంలో సమావేశమై జూన్ 24న ప్రధానితో జరిగిన భేటీపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. 2019 నుంచీ జమ్మూకశ్మీర్కు ఊపిరాడకుండా చేస్తున్న అణచివేత వాతావరణానికి ముగింపు పలికే పటిష్ట చర్యల ప్రస్తావన లేనందుకు నిరాశ వ్యక్తం చెందారు. జమ్మూకశ్మీర్ సమస్యకు సంబంధించినంత వరకూ అక్కడి ప్రజలే భాగస్వాములు, బాధితులు కూడా అని’ కూటమి ప్రతినిధి సీపీఐ(ఎమ్) నేత ఎమ్వై తారిగమ్ తెలిపారు.