న్యూ ఢిల్లీ: నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా ఈ శ్లాబ్ లోని పలు వస్తువులను 5 శాతం శ్లాబులోకి మార్చడం వంటి ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానా ఆదాయం రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకూ తగ్గవచ్చని అంచనా. అయినప్పటికీ, ధరలు తగ్గితే వినియోగం పెరిగి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ నిర్ణయం అమలైతే టూత్‌పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ. 1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500-1000 మధ్య ధర ఉండే పాదరక్షలు వంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఈ నెలాఖరులో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.