విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌గా విశ్వభూషణ్ బాధ్యతలు చేపట్టినట్టయింది. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి సీఎం, ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు వీలుగా శాసనసభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీ నుంచి రాజ్ భవన్‌కు చేరుకున్నారు.