
హైదరాబాద్ : పులివెందులలో తన చిన్నాన్న వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతంపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ రాజ్ భవన్‌లో ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలుసుకుని హత్యోదంతంపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిని ఎదుర్కొనేందుకు తాము కొత్త అభ్యర్థిని తీసుకొచ్చామని చెప్పారు. ఈ క్రమంలో తన చిన్నాన్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలిపారు. దీనిని సహించలేక ఆయనను హత్య చేశారని ఆరోపించారు. ఇందులో టీడీపీ ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు సమ్మతించడం లేదని నిలదీశారు. ఆయన ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని, పకడ్బందీ వ్యూహంతో హత్య చేశారని తెలిపారు. డీజీపీ, అదనపు డీజీపీలను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరానని వెల్లడించారు. అలాంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా సాగవన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.