బెంగళూరు : ఫన్జార్ట్ ఈగిల్స్ జట్టు ప్రొలీగ్ గోల్ఫ్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచింది. నాలుగు నెలల పాటు సాగిన ఈ టోర్నమెంట్ ఇటీవల ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో టీమ్ బ్రిటానియా బౌర్బన్‌ను ఓడించడం ద్వారా ఫన్జార్ట్ ఈగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. డిజైనర్ ఫ్యాన్ బ్రాండ్ ఫన్జార్ట్‌కు చెందిన ఈ జట్టులో 18 మంది సభ్యులున్నారు. హ్యాండీక్యాప్ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు ఫన్జార్ట్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనిల్ లాలా తెలిపారు. తమ జట్టు ట్రోఫీని చేజిక్కించుకోవడం సంతోషంగా ఉందని, జట్టు సభ్యుల కృషిని తాను ప్రశంసిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ బజాజ్, రాహుల్ భల్లా, ప్రహ్లాదరావు లాంటి దిగ్గజ గోల్ఫర్లు జట్టులో ఉండడం వల్ల తామీ అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జట్టు సమష్టి కృషి వల్లే ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగామని కెప్టెన్ అరుణ్ బజాజ్ తెలిపారు. టీమ్ బ్రిటానియా బౌర్బన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నామని, ఆ జట్టు అద్భుతంగా ఆడిందని ఆయన ప్రశంసించారు.