చెన్నై: ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) గురువారం ఇక్కడి ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో సంతానం.1961 నవంబరు 11న శివ కామసుందరితో హనుమకొండలో వివాహమైంది. ముగ్గురు కుమారులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) పూర్తి చేసిన ఆయన 1959లో చిత్తూరులో ఆంధ్రప్రభ ఉప సంపాదకుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా, కార్యక్రమ నిర్వాహకుని, 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పని చేశారు. ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన 290కి పైగా చిత్రాల్లో నటించారు. అంతకు ముందు నాటకాలు, కథలు, నవలలు రాసారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితా నంది పురస్కారాలు అందుకున్నారు. మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం లభించింది.