చెన్నై:దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. అక్కడ ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు నిత్యం తమిళనాడుకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటి సారిగా గాజె వంతెన నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది.