లింగ సమానత్వంలో పూర్‌

లింగ సమానత్వంలో పూర్‌

న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక ఫోరం బుధవారం విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచికలో భారత్ స్థానం మరింత దిగజారింది. గతంలో 127వ స్థానంలో ఉన్న మన దేశం తాజాగా 129వ స్థానానికి పడిపోయింది. ప్రథమ స్థానంలో నిలిచిన ఐస్లాండ్ తన ర్యాంకును నిలబెట్టుకుంది. దక్షిణాసియాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్కు చిట్టచివరి స్థానం దక్కింది. మొత్తం 146 దేశాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక ఫోరం లింగ వ్యత్యాస సూచికలు విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే సూడాన్ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోగా పాకిస్తాన్ 145వ ర్యాంక్ సాధించింది. బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్తాన్, మొరాకో దేశాలతో పాటు భారత్లో మహిళలు, పురుషుల మధ్య ఆర్థికపరమైన సమానత్వం అతి తక్కువ స్థాయిలో ఉంది. ఈ దేశాలన్నీ ఆదాయానికి సంబంధించి 30% కంటే తక్కువగానే లింగ సమానత్వాన్ని నమోదు చేసుకున్నాయి. అయితే సెకండరీ విద్యలో నమోదుకు సంబంధించి మాత్రం మన దేశం మెరుగైన సమానత్వాన్ని కనబరిచింది. రాజకీయాల్లో మహిళా సాధికారత విషయంలో కూడా మంచి ర్యాంకునే పొందింది. ఈ అంశంలో అంతర్జాతీయంగా భారత్కు 65వ స్థానం లభించింది.
గత యాభై సంవత్సరాల కాలంలో రాజ్యాధికారాన్ని అనుభవించిన అంశంలో పురుషులు, మహిళల మధ్య సమానత్వానికి సంబంధించి భారత్ 10వ ర్యాంకులో నిలిచింది. 140 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశం తన లింగ వ్యత్యాసంలో ఈ సంవత్సరం 64.1 శాతానికి చేరింది. తద్వారా గత సంవత్సరపు 127వ స్థానం నుంచి రెండు ర్యాంకులు దిగజారింది. విద్య, రాజకీయ సాధికారత అంశాల్లో ర్యాంకులు స్వల్పంగా తగ్గడమే దీనికి కారణం. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం అనే అంశాల్లో మాత్రం ర్యాంకులు కొంచెం మెరుగుపడ్డాయి.
గత నాలుగు సంవత్సరాల్లో ఆర్థిక సమానత్వానికి సంబంధించిన ర్యాంకు మెరుగుపడిందని ప్రపంచ ఆర్థిక ఫోరం తెలిపింది. రాజ్యాధికార సూచికకు సంబంధించి రాజకీయ సాధికారత ఉప సూచికలో భారత్ మొదటి పది ర్యాంకుల్లోనే స్థానం పొందింది. అయితే మహిళల ప్రాతినిధ్యం మాత్రం మంత్రుల స్థాయిలో (6.9 శాతం), పార్లమెంటులో (17.2 శాతం) తక్కువగా ఉంది. ప్రపంచ దేశాలు లింగ వ్యత్యాసంలో 68.5 శాతానికి చేరువగా ఉన్నాయని, అయితే ప్రస్తుత వేగాన్ని బట్టి పూర్తి లింగ సమానత్వాన్ని సాధించాలంటే మరో 134 సంవత్సరాలు….ఐదు తరాలకు సమానం…పడుతుందని ప్రపంచ ఆర్థిక ఫోరం తెలిపింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ లింగ వ్యత్యాసం 0.1 శాతానికి చేరువైందని చెప్పింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రపంచదేశాలన్నీ కృతనిశ్చయంతో కృషి చేయాలని ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ సాదియా జహిదీ చెప్పారు. సమానత్వం కోసం 2158 వరకూ వేచి ఉండలేమని, నిర్ణయాత్మక చర్యకు ఇదే అనువైన సమయమని తెలిపారు. కాగా లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ తర్వాత ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos