గౌహతి: కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియా నివాసి దీపక్ బ్రహ్మ కరోనా కష్టాల్ని భరించ లేక తన 15 రోజుల కుమార్తెను రూ.45 వేలకు అమ్ముకున్నాడు. పొట్ట కూటి కోసం కన్నపేగునే అమ్ముకోవటం కంటతడి పెట్టిస్తోంది. దిక్కుతోచని స్థితిలో కడుపు నింపుకోవడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన వేళ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ తల్లిదండ్రులు తెలిపారు. దీపక్ బ్రహ్మ గుజరాత్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. లాక్డౌన్వల్ల ుపాది కోల్పోయి కొన్ని రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అక్కడ కూడా ఏ పనీ దొరక్కపోవడంతో భార్యా పిల్లలతో అదే జిల్లాలోని కొచుగావ్ పటకట గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. అక్కడ పేదరికం వెక్కిరించింది. పేదరికంతో అల్లాడుతుండగా దీపక్ భార్య రెండో సంతానంగా -ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కూటి కోసం దీపక్ గత జులై 2న తన భార్యకు తెలియకుండా 15 రోజుల తన కుమార్తెను ఇద్దరు మహిళలకు రూ.45 వేలకు అమ్మాడు. పాప ఏదని దీపక్ను భార్య నిలదీసింది. వాస్తవాన్ని విని కుంగి పోయింది. తల్లి దండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీపక్ నుంచి వివరాలు సేకరించి ఆ ఇద్దరు మహిళల నుంచి శిశువును రక్షించి తల్లి ఒడి చేర్చారు. తమకు సంతానం లేనందున శిశువును కొన్నామని ఇద్దరు మహిళలు చెప్పారు.