పరివార్‌ పతనానికి తీర్మానం

పరివార్‌ పతనానికి తీర్మానం

గాంధీనగర్‌: ‘దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమైంది.. ఫాసిజం, విద్వేషం, ఆగ్రహం, విభజన తీరుతో రాజకీయాలు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా భావజాలాలను ఓడించాలని నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రాజీ లేకుండా పూర్తిగా ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో గెలుస్తుంది’ అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం  ట్వీట్‌ చేశారు.  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించటానికి ముందు  అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌ నేతలు ఏకే అంటోనీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు ఇతర ముఖ్యనేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీజీ అహింసా సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. మార్చి 12, 1930న మహాత్మా గాంధీ ఇక్కడి నుంచే దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం) ప్రారంభించారు. గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై ఆ పార్టీ నేతలు కీలక చర్చలు జరుపు తున్నారు. భాజపాను ఓడించే వ్యూహాలను రచించి, తమ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌ నేతలు సందేశం ఇవ్వనున్నారు. పేదలకు కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని ఇటీవల రాహుల్‌ ఇచ్చిన హామీపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos