న్యూ ఢిల్లీ : కోవిడ్-19 డ్రగ్స్ను పంచేందుకు లైసెన్స్ ఉందా ? అని బిజెపి నేత, ఎంపి గౌతమ్ గంభీర్ ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. తన నియోజకవర్గమైన తూర్పు ఢిల్లీ ప్రజలకు ఉచితంగా ఫాబిఫ్లూ డ్రగ్స్ ఇస్తానని గౌతమ్ గంభీర్ ఇటీవల ట్వీట్ చేశారు. ఫాబిఫ్లు యాంటీ-వైరల్ ఔషధాన్ని తేలికపాటి నుంచి మితమైన కోవిడ్ -19 వ్యాధికి చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. గత కొన్ని వారాలుగా ఫాబిఫ్లు, రెమిడెసివిర్ ఔషధాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ మందులను మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు దాడులు సైతం చేసి మందులను పట్టు కుంటున్నారు. దరిమిలా గంభీర్ ట్వీట్ తీవ్ర చర్చనీ యాంశమైంది. తూర్పు ఢిల్లీ వాసులు తన కార్యాలయానికి వచ్చి ఉచితంగా ఫ్రీగా ఫాబిఫ్లూ ఔషధాన్ని తీసుకెళ్లవచ్చని.. కేవలం ఆధార్ కార్డు, ప్రిస్క్రిప్షన్ చూపిస్తే సరిపోతుంద’ని ట్వీట్ చేసారు. దీన్ని విపక్షాలు ఆక్షేపించాయి. విపత్కర పరిస్థితుల్లో జనాలకు ఉచితగా పెట్టేంత స్థాయిలో ఫాబిఫ్లూ గంభీర్ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయి ? ఇది అక్రమం కాదా ?ని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించాయి. గంభీర్ ప్రకటనకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యం పై ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది రాహుల్ మెహ్రా వాదించారు. గంభీర్ బాధ్యతారహితమైన ప్రకటన చేసారని తప్పుబట్టారు. కోవిడ్ -19 చికిత్సకు వాడుతున్న మందులను గౌతమ్ గంభీర్ ఎలా పంపిణీ చేయగలరు ? వాటిని పెద్ద మొత్తంలో ఎలా సేకరించగలరు ? ఇందుకు గంభీర్కు అసలు లైసెన్స్ ఉందా ? ఇలాంటి వాటికి లైసెన్స్ అవసరం లేదా ? అంటూ జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లి ధర్మాసనం బెంచ్ ప్రశ్నించింది. ఆ నివేదిక సమర్పించేంత వరకు దీనిపై విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై గంభీర్ వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.