న్యూఢిల్లీ: భారతీయుడిగా గర్వపడుతున్నట్లు ఇటీవల ప్రకటించుకున్న అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు శుక్రవారం మాటమార్చాడు. తనను ‘దేశభక్తుడు’గా చిత్రీకరించి మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తన మాటలను మాధ్యమాలు వక్రీకరించాయని ఆరోపించారు. ‘వాళ్లు నా తండ్రిని చంపి, నా కుటుంబం మొత్తానికి అన్యాయం చేశారు. అలాంటప్పుడు నేను భారతీయుడిగా ఎలా గర్విస్తాను? కశ్మీర్‌కి కూడా వాళ్లు అన్యాయం చేశారు.’ అని వ్యాఖ్యానించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు కోసం ఇటీవల తను దరఖాస్తు చేసారు. ‘నాకు ఆధార్ కార్డు కూడా ఉన్నప్పుడు పాస్‌పోర్టు ఎందుకు ఉండకూడదు? విదేశాల్లో స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకునేందుకు నాకు పాస్‌పోర్టు అవసరం’ అని గాలిబ్ పేర్కొన్నారు. 2001లో పార్లమెంట్ పై దాడి జరిపిన నేరానికి గాలిబ్ తండ్రి అఫ్జల్ గురును 2013లో ఉరి తీశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహ్మద్ పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నినట్టు తేలింది. దాడి సందర్భంగా ఉగ్ర వాదులు జరిపిన కాల్పుల్లో ఆరు గురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోట మాలి ప్రాణాలు కోల్పోయారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.