బళ్లారి: హిందువులు చెప్పినట్లు వినని ముస్లింలకు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించిన భాజపా శాసనసభ్యుడు గాలి సోమ శేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోలీసులు ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. శుక్రవారం ఇక్కడ జరిగిన నూతన పౌర సత్వ చట్ట సమర్థన సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రసంగించినప్పటికీ పార్టీ నాయకత్వం మంద లించ లేదు. దరిమిలా సోమశేఖర రెడ్డికి వ్యతిరేకంగా చర్యల్ని తీసుకోవాలని డిమాండు చేస్తూ ముస్లింలు శనివారం పట్టణంతో బాటు గదగ్, రామనగర, కోలారు పట్టణాల్లో నిరసన ప్రదర్శన చేసారు. పోలీసులు ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేయకుండానే ఆ పని చేసినట్లు అబద్ధాలాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ సమితి నేతలు బెంగళూరులో ఆరోపించారు. దీనిపై సాయంత్రం పోలీసుల డైరెక్టర్ జనరల్ నీలమణి రాజుకు ఫిర్యాదు చేయనున్నారు.