విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డైనమిక్ సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు మంచి చేయాలన్న గట్టి ఆశయం ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలరని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ కోరిన ఈస్ట్రన్ రింగు రోడ్డుకు ఇప్పుడే ఆమోదం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. 20 ఆర్ఓబీలకు బదులుగా 30 ఆర్ఓబీలను మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవి. వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఏపీకి వస్తానని మంత్రి తెలిపారు. తాను జలవనరుల మంత్రి కానప్పటికీ పోలవరం ప్రాజెక్టును చూస్తానని అన్నారు. జలాలు సముద్రంలో కలవకముందే నదులను అనుసంధానించుకుందామని గడ్కరీ సూచించారు. అలాగే.. పరిశ్రమలతోనే ఉపాధి కల్పన సాధ్యమన్నారు. ఇథనాల్ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని నితిన్ గడ్కరీ ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. త్వరలో డీజిల్ లారీలకు బదులుగా ఎలక్ట్రిక్ లారీలు, డీజిల్ స్థానంలో సిఎన్‌జీ, ఎల్‌పీజీ రవాణా వాహనాలు వస్తాయని సూచించారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి.. గ్రీన్ హైడ్రోజన్ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.