| కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు గడ్కరీ తెలిపారు. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తే తనకు మద్దతు ఇస్తామని ప్రతి పక్షాలు చెప్పినట్లు వెల్లడించారు. గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా నాకు చాలా సార్లు ఇలాంటి ఆఫర్ వచ్చింది. మోదీకి బదులు నన్ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపక్షాలు ప్రతిపాదనలు చేశాయి. అయితే, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. మోదీ బదులుగా నేను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం అంటే బీజేపీలో చీలిక సృష్టించాలనే ప్రతిపక్షాల పథకం’ అని పేర్కొన్నారు. ‘నేను నా భావజాలంతో రాజీపడను. ప్రధాని పదవి ఆఫర్‌ను అంగీకరించే ప్రశ్నే లేదు. ప్రధాని కావాలనేది నా లక్ష్యం కాదు. ఆ పదవిపై ప్రత్యేక ఆసక్తి కూడా నాకు లేదు. మోదీ పాలనలో నా బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నేను మొదటగా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిని. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తని, మంత్రి పదవి ఉన్నా లేకపోయినా.. నేను నిబద్ధత కలిగిన కార్యకర్తగానే పనిచేస్తాను’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.