తాడేపల్లి : ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ నీతి, న్యాయం పాటించకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో మంగళవారం ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసినట్లు పత్రికల్లో వచ్చింది. హైకోర్టులో మాత్రం ఆ ప్రమాణ పత్రం బుధవారం దాఖలైనట్లు ఉంది. ముందుగానే పత్రికలకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు తెలిపారు? ఇలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలా నమ్మాలి? చంద్రబాబు ఆదేశాలతో నిమ్మగడ్డ పని చేస్తున్నట్లు తేలింది. సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం వ్యవస్థలను తాకట్టు పెడుతున్నారు. రెండు కేసులున్నపుడు కరోనా పేరిట ఎన్నికల్ని వాయిదా వేసిన ఆయన ఇప్పడు రోజుకు మూడు వేల కేసులు వస్తున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? బాబు చెప్పినట్లు పని చేస్తున్నారు. మూతపడిన పార్టీకి గడపదాటని నేత చంద్రబాబు. విపక్ష నేతగా ఏమీ చేయడం లేదు. అమరావతిలో చేసిన అభివృద్ది శూన్యం. అడుగుకు రూ. 12 వేలు వంతున దోచుకుని సర్వనాశనం చేశారు. దుర్గ వారధిని అర్ధంతరంగా వదిలేస్తే జగన్ పూర్తి చేశారు. ‘పోలవరం’ పేరిట వేల కోట్లు దోచుకున్నారు. రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వం రూ.800 కోట్లు మిగిల్చింది. కాంట్రాక్టులు, కమిషన్లు కోసం కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారు. పేదలకు 30 లక్షల పట్టాలు రాకుండా చేసింది బాబే. ఇప్పుడేమో అర్హులతో ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలపై ఎక్కడైనా సరే చర్చించేందుకు మేము సిద్ధ’మన్నారు.