పులివెందుల: మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు ,శుక్రవారం హతమైన వై.ఎస్.వివేకానంద రెడ్డి అంత్యక్రియల్ని శనివారం పులివెందుల రాజా రెడ్డి ఘాట్‌లో క్రైస్తవ మత సంప్రదాయానుసారం నిర్వహించారు. అశ్రునయనాల మధ్య వివేకా అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందు ఆయన నివాసంలో పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఇందులో పాల్గన్నారు. శనివారం ఉదయం నుంచే వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసా నికి భారీగా జనం తరలివచ్చారు.బంధువులు, సన్నిహితులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.. ఊహించని దారుణంతో వైఎస్సార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అవాంఛనీయాలు సంభవించకుండా పులివెందులలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.